Parliament: నేడు బడ్జెట్ సమావేశాల చివరి రోజు... 12 గంటలకు వైసీపీ రాజీనామా, ఆపై ఆమరణదీక్ష!

  • నేటితో పార్లమెంట్ నిరవధిక వాయిదా
  • ఒక్కరోజైనా సాగని సభ
  • నిరసనల మధ్యే సాగిన బడ్జెట్ సమావేశాలు

నేటితో పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. దాదాపు మూడు వారాలకు పైగా సాగిన సభలో కనీసం ఒక్కటంటే ఒక్క రోజైనా, కనీసం ఒక్క అంశంపైనైనా చర్చ సాగలేదు. ఎంపీల నిరసనల మధ్య తమకు కావాల్సిన కీలక బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టగా అవసలు చర్చకే రాలేదు.

రిజర్వేషన్ల కోటాను నిర్ణయించుకునే బాధ్యత రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ, కావేరీ నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే నేతలు వెల్ లో నినాదాలు చేస్తుండటంతో, సభ నిత్యమూ వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరి నాలుగైదు సెషన్ లలో టీఆర్ఎస్ ఎంపీలు వెల్ లో కాలుపెట్టకపోయినా, అన్నాడీఎంకే నిరసనలు కొనసాగడంతో సభ జరగలేదు. రాజ్యసభలోనూ దాదాపు ఇదే పరిస్థితి.

ఇక నేటితో ఈ మొత్తం ఘట్టానికి తెరపడనుండగా, ఆపై మరో సరికొత్త హైడ్రామా మొదలు కానుంది. లోక్ సభ నిరవధిక వాయిదా పడగానే వైఎస్ఆర్ సీపీ సభ్యులు తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్ లో సభాపతికి అందించనున్నారు. ఆపై నేరుగా ఏపీ భవన్ కు వెళ్లి అక్కడ ఆమరణ దీక్షను ప్రారంభించడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. తమ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తారని దాదాపు నెల రోజుల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎంపీల ఆమరణ దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతిని కూడా మంజూరు చేశారు. ఎంపీలకు మద్దతుగా రాష్ట్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు, రిలే నిరాహార దీక్షలు చేసేందుకు వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.

  • Loading...

More Telugu News