Tej Pratap Yadav: బీహార్ మాజీ సీఎం మనవరాలిని పెళ్లి చేసుకోనున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్
- బీహార్ మాజీ సీఎం కుమార్తెతో లాలూ కుమారుడి వివాహం
- నెలాఖరులో నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి
- పాట్నాలో అంగరంగ వైభవంగా సాగనున్న వివాహం
బీహార్ యువరాజుగా ఆర్జేడీ అభిమానులు భావించే తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం వచ్చే నెలలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్ తో జరగనుంది. దాదాపు పది నెలల క్రితం తన ఇద్దరు కుమారులకూ వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్టు లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీ దేవి ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. తొలుత పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు సంబంధాలు చూడటం మొదలుపెట్టగా, రాష్ట్రానికే చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని ఆమె ఓకే చేశారు. ఇక వీరిద్దరి నిశ్చితార్థం ఈ నెలాఖరులోగా, పెళ్లి వచ్చే నెలలో జరుగుతుందని తెలుస్తోంది.
ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్ అయిన ఐశ్వర్యరాయ్ తండ్రి చంద్రికా రాయ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు సుదీర్ఘకాలంగా మిత్రుడు. ఆర్జేడీ తరఫున ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. ఆయన క్యాబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు. ఐశ్వర్య తాతయ్య ప్రసాద్ రాయ్ 1970వ దశకంలో బీహార్ కు 11 నెలల పాటు సీఎంగా కూడా పనిచేశారు. బీహార్ లో తొలి యాదవ ముఖ్యమంత్రి ఆయనే కావడం గమనార్హం.
ఇక ఈ యువజంట వివాహం పాట్నాలోని వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పెళ్లి అంగరంగ వైభవంగా సాగనుండగా, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు చెందిన వీఐపీలు పాల్గొని వధూవరులను ఆశీర్వదించనున్నారు.