Chandrababu: ఇదిగో.. వైకాపా మరో నాటకం!: చంద్రబాబు
- రాజ్యసభ సభ్యులతో రాజీనామా చేయించరా?
- లోక్ సభ సభ్యులతోనే రిజైన్ ఎందుకు?
- జగన్ నాటకాన్ని ప్రజలు తెలుసుకోవాలి
- రాజీనామాలతో హోదా రాదన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా, తమ రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నాటకానికి నేడు తెరలేపనుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం అమరావతిలో సైకిల్ యాత్ర చేసేందుకు ముందు మాట్లాడిన ఆయన, తమ పార్టీకి చెందిన ఐదుగురు లోక్ సభ సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తారని జగన్ చెప్పడం నాటకం కాదా? అని ప్రశ్నించారు.
వారి పదవీకాలం మరో సంవత్సరం కూడా లేదు కాబట్టే జగన్ వారితో రాజీనామాలు చేయిస్తున్నారని, రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఇద్దరితో రాజీనామా చేయించే దమ్ము జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు. వైకాపా ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయరా? అని ప్రశ్నించారు. రాజీనామా నాటకం వెనుక జగన్ అసలు ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
రాజీనామా చేస్తే ఎంపీలంతా చేయాలే తప్ప, కేవలం లోక్ సభ సభ్యులకు మాత్రమే పరిమితం కావడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. లోక్ సభ సభ్యులకు ఒక న్యాయం, రాజ్యసభ సభ్యులకు మరో న్యాయాన్ని జగన్ పాటిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ నాటకాలు మానాలని, రాష్ట్రానికి నష్టం చేయవద్దని హితవు పలికారు. తామంతా నరేంద్ర మోదీ పక్షాన ఉంటారో లేదా ఏపీ ప్రజల పక్షాన ఉంటారో వైకాపా నేతలే తేల్చుకోవాలని సూచించారు.
మోదీ పక్షాన ఉంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్న సంగతిని గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. ఎంపీలు రాజీనామా చేయడం అంటే, పోరాటం నుంచి పారిపోవడమేనని వ్యాఖ్యానించిన ఆయన, రాజీనామాలు చేస్తే, పార్లమెంట్ కు వెళ్లి నిరసనలు తెలిపే అవకాశం కూడా ఉండదని గుర్తు చేశారు. కేంద్రంపై జరుగుతున్న పోరాటంలో ఎంపీలే ముందు నిలిచి పోరాడే సైనికులని జగన్ గుర్తు పెట్టుకోవాలని కోరారు. సభ్యుల రాజీనామాలతో హోదా రాదని, పార్లమెంట్ వేదికగా పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.