Pawan Kalyan: చేసిన తప్పును మరోసారి చేస్తున్న చంద్రబాబు: పవన్ కల్యాణ్

  • హైదరాబాద్ విషయంలో తప్పు చేసిన చంద్రబాబు
  • అభివృద్ధిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేశారు
  • రాయలసీమ, కళింగ ఉద్యమాలు వచ్చే అవకాశం
  • హెచ్చరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

గతంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో, ఇప్పుడు అమరావతి విషయంలోనూ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, హైదరాబాద్ ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేవలం సైబరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా, అంతే విధ్వంసం కూడా జరిగిందని, చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారని అన్నారు.

దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని, ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే, రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించిన ఆయన, పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందని చెప్పారు. మంగళగిరి అటవీ ప్రాంతంలో 1800 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని చెప్పిన చంద్రబాబు, అన్ని వేల ఎకరాలు ఎందుకు సమీకరించారని ప్రశ్నించారు. మహానగరాలు రాత్రికి రాత్రి నిర్మితం కాలేదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని హితవు పలికారు.

Pawan Kalyan
Rayalaseema
Kalinga
Jana Sena
Hyderabad
Chandrababu
  • Loading...

More Telugu News