parliament: మార్షల్స్‌ సాయంతో బలవంతంగా బయటకు తీసుకొచ్చారు: మండిపడ్డ ఎంపీ సీఎం రమేశ్

  • అవిశ్వాసంపై చర్చ జరపకుండా బీజేపీ కుట్ర 
  • బీజేపీ తీరును నిరసిస్తూ రాజ్యసభలో నిరసన తెలిపాం
  • నా మెడపై దెబ్బలు కూడా తగిలాయి
  • రేపు మా పోరాటాన్ని మరింత తీవ్ర‌త‌రం చేస్తాం

విభజన హామీలు నెరవేర్చాలంటూ రాజ్యసభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీడీపీ లోక్‌సభ సభ్యులు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ధర్నా చేపట్టగా వారిని ఎట్టకేలకు ఆయా చోట్ల నుంచి పార్లమెంటు సిబ్బంది మార్షల్స్ సాయంతో బయటకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ... పార్లమెంటులో అన్నాడీఎంకేతో నిరసనలు తెలిపేలా చేసి, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరును నిరసిస్తూ తాము రాజ్యసభలో కూర్చుంటే మార్షల్స్ సాయంతో బలవంతంగా పశువులను లాక్కొచ్చినట్లు బయటకు తీసుకొచ్చారని అన్నారు. ఈ క్రమంలో తన మెడపై దెబ్బలు కూడా తగిలాయని చూపించారు.

ఇటువంటి తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని సీఎం రమేశ్‌ వ్యాఖ్యానించారు. తమ పోరాటం ఆగదని, రేపు త‌మ పోరాటాన్ని మరింత తీవ్ర‌త‌రం చేస్తామ‌ని చెప్పారు. స‌భ్యుల పట్ల గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

కాగా, పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో కళ్లు తిరిగిపడిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, సుజనా చౌదరి, గల్లా జయదేవ్ ఆసుపత్రికి వెళ్లి అవంతి శ్రీనివాస్‌ను పరామర్శించారు.  

  • Loading...

More Telugu News