iyr krishna rao: కొందరికి లబ్ధి చేకూర్చేందుకే అమరావతిని ఎంపిక చేశారు!: ఐవైఆర్ కృష్ణారావు
- రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యం కాదు
- వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా రాజధానిని ఎంపిక చేశారు
- సారవంతమైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం తగదు
వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా రాజధాని అమరావతిని ఎంపిక చేశారని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శించారు. ఐవైఆర్ రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతి అన్ని ప్రాంతాలకు ఆమోదయోగ్యం కాదని, రాజధానిపై ఏకాభిప్రాయ సాధనకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని అన్నారు.
కొందరికి లబ్ధి చేకూర్చేందుకే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారని, పాలకవర్గ విధేయుల రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా దీనిని ఎంపిక చేశారని విమర్శించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ అందరినీ తప్పుదోవ పట్టించారని, ఆ తర్వాత అమరావతి సమీపంలో రాజధానిని ప్రకటించారని అన్నారు. సారవంతమైన భూములు ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం సరికాదని, కొంత మంది రియల్టర్లకు మేలు చేసేందుకే ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని ఐవైఆర్ ఆరోపించారు.