Sonia Gandhi: పార్లమెంటులో విపక్షాల మానవహారం.. డుమ్మా కొట్టిన వైసీపీ!
- వైసీపీ, అన్నాడీఎంకే మినహా అన్ని పార్టీల హాజరు
- రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు కార్యక్రమం
- అనంత్ కుమార్ పై సోనియాగాంధీ ఫైర్
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ... ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలు మానవహారం చేపట్టాయి. రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సహా టీడీపీ, బీఎస్పీ, సమాజ్ వాదీ, ఎన్సీపీ, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే తదితర పార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే, వైకాపాలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పై విమర్శలు కురిపించారు. సభ సజావుగా నడవకపోవడానికి ఆయనే కారణమని ఆరోపించారు. పలు సమస్యలపై చర్చను చేపట్టకపోవడమే కాకుండా, గొడవకు కారణం కాంగ్రెస్ పార్టీనే అంటూ సభలో అబద్ధాలు మాట్లాడారని అన్నారు.