Aadhar: రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలనూ అడుగుతారేమో... ఆధార్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు!

  • ఆధార్ అనుసంధానం కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు
  • విధాన నిర్ణయాల్లో కోర్టులు కలుగజేసుకోజాలవన్న అటార్నీ జనరల్
  • కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై కీలకమైన కేసును విచారిస్తున్న అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో ఆధార్ బోర్డు ప్రజల రక్త నమూనాలను, డీఎన్ఏనూ, మూత్ర నమూనాలనూ సేకరిస్తామని కూడా చెబుతుందేమోనని వ్యాఖ్యానించింది. కోర్టులో వాదనలు జరుగుతున్న వేళ, ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం వాదనలు వినిపించిన వేళ, న్యాయమూర్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏకే సిక్రీ, ఏఎం ఖాన్ విల్కార్, డీవీ చంద్రచూడ్, అశోక్ భూషణ్ లతో కూడిన బెంచ్ ముందు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని అన్నారు.

ఇండియాలో దారిద్ర్య రేఖకు దిగువన నిజంగా మగ్గుతున్న వారిని ఆదుకోవాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా ఆయన వాదనలు వినిపించారు. సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఆధార్ కార్యక్రమం నడుస్తోందని, కోర్టులు ఇందులో కల్పించుకోజాలవని అన్నారు. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడినదా? నిజాయితీతో ఉన్నదా? అన్న అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందని చెప్పారు.

 ఈ స్కీమ్ ను, ఆధార్ కార్డును వ్యతిరేకిస్తున్న వారి పరిస్థితి ఏంటని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, భవిష్యత్తులో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని ప్రశ్నించింది. పలు రకాల సంక్షేమ పథకాల్లో నిజమైన లబ్దిదారుల ఎంపికకు ఆధార్ ఎంతో ఉపకరిస్తోందని వేణుగోపాల్ వాదించారు. కేసు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది.

Aadhar
Supreme Court
Atorney General
Biologicle Atributes
  • Loading...

More Telugu News