Maharashtra: అరుదైన అభ్యర్థన: పురుషుడిగా మారుతానని సీఎంను కోరుతున్న మహిళా కానిస్టేబుల్!

  • మహారాష్ట్ర పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న లలితా సాల్వే
  • నాలుగేళ్ల క్రితం తనలో మార్పులను గుర్తించిన కానిస్టేబుల్  
  • శస్త్ర చికిత్సతో పురుషుడిగా మారుతానని సీఎంకు అభ్యర్థన

'లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని లలిత్ గా మారుతాను.. అనుమతివ్వండి..'  అంటూ మహారాష్ట్రకు చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివీస్ ను ఆశ్రయించడం ఆసక్తి రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... లలితా సాల్వే (29) మహారాష్ట్రలో మహిళా కానిస్టేబుల్‌ గా పని చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తనలో వస్తున్న చిత్రమైన మార్పులను గమనించిన ఆమె వైద్యుల వద్దకు వెళ్లగా, ఆమెను పరీక్షించిన డాక్టర్లు, ఆమెలో పురుష క్రోమోజోములు ఉన్నాయని నిర్ధారించి, కౌన్సిలింగ్‌ ఇచ్చారు. దీంతో ఆమె లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో శస్త్రచికిత్స కోసం నెలరోజుల సెలవు మంజూరు చేయాలనీ, ఆ తరువాత పురుష కానిస్టేబుల్‌ గా కొనసాగేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె మహారాష్ట్ర పోలీసు శాఖను అభ్యర్థించారు. ఎత్తు, బరువు సహా స్త్రీ, పురుష కానిస్టేబుళ్లకు వేర్వేరు అర్హత నిబంధనలు ఉంటాయనీ, అందువల్ల మహిళా కానిస్టేబుల్ శస్త్ర చికిత్స ద్వారా పురుష కానిస్టేబుల్ గా మారేందుకు సెలవు మంజూరు చేయడం కుదరదని పోలీసు శాఖ స్పష్టం చేసింది.

 దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. వ్యాజ్యం ఉద్యోగానికి సంబంధించినది కావడంతో పరిపాలన ట్రైబ్యునల్‌ ను ఆశ్రయించాలని సూచించింది. దీంతో ఆమె సీఎంను ఆశ్రయించింది. పురుషుడిగా మారి, విధుల్లో కొనసాగేందుకు అనుమతినివ్వాలని కోరింది. ఆయన అనుమతి కోసం రెండు వారాలుగా ఎదురు చూస్తోంది. అరుదైన అభ్యర్థన కావడంతో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. సీఎం ఏం చెబుతారోనని ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

  • Loading...

More Telugu News