Pawan Kalyan: రెల్లి కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ అవసరం : పవన్ కల్యాణ్
- జనసేన అధినేతను కలిసిన రెల్లి సంఘం ప్రతినిధులు
- తమ సమస్యలు విన్నవించుకున్న రెల్లి కులస్తులు
- అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్
రెల్లి కులస్తుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ని రెల్లి కుల సంఘం ప్రతినిధులు ఈరోజు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని, జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రెల్లి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై తనకు అవగాహన ఉందని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పన, వ్యాపార రంగంలో నిలదొక్కుకునే విధంగా చేయడం వంటి విషయాలపై జనసేన పార్టీ పక్షాన నిర్దిష్టమైన విధానాలు రూపొందిస్తామని చెప్పారు. రెల్లి కులస్తులు విద్య, ఉపాధి రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
కాగా, ఎస్సీ సామాజిక వర్గంలో భాగమైన తాము విద్య, ఉద్యోగావకాశాల్లో వెనుకబడిపోయామని, సామాజికంగా, రాజకీయంగా తమ కులం నిర్లక్ష్యానికి గురవుతోందని రెల్లి సంఘం ప్రతినిధులు పవన్ ముందు వాపోయారు. 13 జిల్లాల్లో 20 లక్షల మంది రెల్లి, సంబంధిత కులస్తులు ఉన్నారని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులుగా, మలమూత్రాలు ఎత్తివేసే వృత్తుల్లోనే ఉండటంతో సామాజిక వెనకబాటుతనంతో అనేక ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పారు.
ఎస్సీ రిజర్వేషన్ లో రెల్లి కులానికి అవకాశాలు రావడం లేదని, ఎస్సీ కార్పొరేషన్ లో తమ కులం నుంచి ఎవరిని నామినేట్ చేయలేదని, ఆ సంస్థ ద్వారా రెల్లి కులస్తులకు అందాల్సిన లబ్ధి చేకూరడం లేదని తెలిపారు. రాజకీయంగా కూడా తమ సామాజిక వర్గం నిర్లక్ష్యానికి లోనవుతోందని, పంచాయతి, మునిసిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చదువుకున్న యువకులకు తగిన ఉపాధి లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులుగానే మారాల్సి వస్తోందని వాపోయారు. సులభ్ కాంప్లెక్స్ లను ఇతర కులాలు నిర్వహిస్తుంటే తమ రెల్లి కులస్తులు అక్కడ పని చేస్తున్నారని, అలాంటి వాటి నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగిస్తే నిలదొక్కుకొంటామని, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు అవసరం ఉందని, తమకు న్యాయం జరిగేలా చూడాలని పవన్ ని రెల్లి కుల సంఘం అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వర రావు కోరారు.