Pawan Kalyan: గుంటూరు వైద్యులతో చర్చించిన పవన్ కల్యాణ్!

  • విజయవాడలో పవన్ ని కలిసిన వైద్యుల బృందం
  • హెపటైటిస్ తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పిన వైద్యులు  
  • ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పిన పవన్ కల్యాణ్

వేసవి కాలం ప్రారంభమైన తరుణంలో అతిసారం, హెపటైటిస్ వ్యాధులు గుంటూరు నగరంలో వ్యాప్తి చెందడం, మరణాలు సంభవించడం దురదృష్టకరమని, వర్షాకాలం వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ ని గుంటూరుకు చెందిన 40 మంది వైద్యులతో కూడిన బృందం కలిసింది.

ప్రస్తుతం హెపటైటిస్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటి నుంచి తక్షణ చర్యలు చేపట్టకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, జనసేన తరఫున వైద్యుల బృందంతో ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని వారికి చెప్పారు. మరో వైపు పాలకులు తమ బాధ్యతను గుర్తుంచుకునేలా ఒత్తిడి పెంచుతామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని అన్నారు. కాగా, కలుషితమైన నీటిని తాగడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ లోపాలు, మంచినీటి పైపుల వెంబడే మురుగు నీరు వెళ్లే గొట్టాలు ఉన్నాయని దీని మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. తాగునీటిని పలు దశల్లో శుద్ధి చేసి సరఫరా చేయాల్సిన బాధ్యత నగరపాలక అధికారులపై ఉందని చెప్పారు. అలాగే వాటర్ క్యాన్స్ ద్వారా విక్రయించే నీటిలోనూ నాణ్యత ఉండటం లేదనీ, వీటినీ శుద్ధి చేయాలసిందేనని వైద్యులు అభిప్రాయపడ్డారు.

హెపటైటిస్ ఎ, హెపటైటిస్ ఈ... కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వస్తాయని తెలిపారు. ఇప్పటికే వైద్య పరీక్షల్లో పలువురు హెపటైటిస్ బారిన పడ్డ విషయం తేలిందని చెప్పారు. ప్రజారోగ్య సంరక్షణలో పవన్ కల్యాణ్ ముందుండాలనేది తమ ఆకాంక్ష అని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News