rbi: ఆర్బీఐ ఆడిటింగ్ సరిగా లేకనే పీఎన్బీ కుంభకోణం జరిగింది : సీవీసీ కేవీ చౌదరి
- రిస్క్ ను గుర్తించేందుకు కచ్చితమైన కొలమానాలు ఉండాలి
- బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరం
- పీఎన్బీ, ఆర్బీఐకి సంబంధించిన అంశాలు మా పరిశీలనలో ఉన్నాయి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో కుంభకోణం విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీరును కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి తప్పుబట్టారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పీఎన్బీలో కుంభకోణం జరగడానికి కారణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆడిటింగ్ సరిగ్గా లేకపోవడమేనని విమర్శించారు.
రిస్క్ ను గుర్తించేందుకు ఆర్బీఐకు కచ్చితమైన కొలమానాలు ఉండాలని, సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తోంది తప్ప బ్యాంకు శాఖల వారీగా పరిశీలన చేయడం లేదని అన్నారు. బ్యాంకింగ్ రంగానికి మెరుగైన వ్యవస్థ అవసరమని సూచించారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన నియంత్రణ బాధ్యతలు ఆర్బీఐకే ఉన్నప్పటికీ ఈ విషయంలో చిత్తశుద్ధి లోపిస్తే కేంద్ర విజిలెన్స్ సంస్థ పర్యవేక్షిస్తుందని, పీఎన్బీ, ఆర్బీఐకి సంబంధించిన చాలా అంశాలు తమ పరిశీలనలో ఉన్నాయని కేవీ చౌదరి చెప్పారు.