New Delhi: నిధులు విడుదల చేసి మళ్లీ వెనక్కు తీసుకున్నారు: ఢిల్లీలో చంద్రబాబు

  • కేంద్ర సర్కారు వైఖరిపై ఏపీ ప్రభుత్వం పోరాడుతోంది
  • చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాలని అడుగుతున్నాం
  • ఏపీ ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం
  • రాజకీయ లబ్ది కోసం సమస్యలు సృష్టించకూడదు

ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హక్కుల సాధన కోసం తమ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇస్తే చాలా పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. విభజన చట్టం అమలుపై ఎందుకు సమీక్షించరని ప్రశ్నించారు.

వెనకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేసి మళ్లీ వెనక్కు తీసుకున్నారని, దీనిపై అడిగితే పీఎంవో ఒప్పుకోలేదని, అందుకే వెనక్కు తీసుకున్నామని సమాధానం ఇచ్చారని చంద్రబాబు అన్నారు. జాతీయ విద్యా సంస్థలను మంజూరు చేసి తక్కువ నిధులు ఇచ్చారని, ఇలా చేస్తే విద్యా సంస్థలు ప్రారంభం కావడానికి 30 ఏళ్లు పడుతుందని చెప్పారు. అలాగే, రైల్వే జోన్‌ హామీని పట్టించుకోవట్లేదని, షెడ్యూల్ 9, 10 అంశాలను విస్మరించారని, దీంతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ సమాధానం చెప్పాలనే అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చామని, కేంద్ర సర్కారు వైఖరిపై ఏపీ ప్రభుత్వం పోరాడుతోందని చంద్రబాబు తెలిపారు. చట్టంలో ఉన్న వాటిని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నామని, ఏపీ ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సమస్యలను సృష్టించకూడదని అన్నారు. 

  • Loading...

More Telugu News