WHATSAPP PLUS: మీ ఫోన్లో వాట్సాప్ ఉందా? లేక వాట్సాప్ ప్లస్ ఉందా...?... ప్లస్ ఉంటే ప్రమాదమే!

  • ప్లస్ పేరుతో నకిలీ యాప్
  • ఏపీకే ఫైల్ రూపంలో ఆన్ లైన్ లో సంచారం
  • యూజర్ల సమాచారానికి రిస్క్ ఉందన్న మాల్వేర్ బైట్స్

వాట్సాప్ దాదాపు ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో కనిపించే సామాజిక మాధ్యమం. అయితే, దీని ప్రాచుర్యాన్ని చూసి మాయగాళ్లు వాట్సాప్ ప్లస్ తో ఓ యాప్ ను రూపొందించి యూజర్ల సమాచారాన్ని రాబడుతున్న విషయం బయటకు వచ్చింది. వాట్సాప్ ప్లస్ పేరుతో ఉండే యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలన్నీ సేకరిస్తున్నట్టు మాల్వేర్ బైట్స్ ల్యాబ్ అనే సంస్థ వెల్లడించింది.

‘‘ఏపీకే ఫైల్ రూపంలో ఉండే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత బంగారం రంగులో వాట్సాప్ ఐకాన్ దర్శనమిస్తుంది. ఇన్ స్టాల్ తర్వాత అగ్రీ, కంటిన్యూ అని ఓకే చేస్తే గడువు తీరిపోయిందని, తిరిగి ఇన్ స్టాల్ చేసుకుని, అప్ డేట్ చేసుకోవాలన్న సందేశం కనిపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి తాజా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది. అక్కడ ఓకే చేస్తే అంతా అరబిక్ లో ఉండే ఓ అనుమానాస్పద వెబ్ సైట్ కు తీసుకెళుతోంది’’ అని మాల్వేర్ బైట్స్ తెలిపింది. ఈ యాప్ లో అందుకున్న సందేశాలు కనిపించకుండా చేసే హైడింగ్ ఆప్షన్ ఉందని, వాయిస్ క్లిప్ కూడా కనిపించకుండా చేసుకోవచ్చని పేర్కొంది. ఈ యాప్ నిర్వాహకుల సమాచారం లేకపోవడంతో నమ్మతగినది కాదని మాల్వేర్ బైట్స్ సూచించింది.

  • Loading...

More Telugu News