flipkart: ఫ్లిప్ కార్ట్ ను సొంతం చేసుకునే ఆలోచనలో అమేజాన్?
- నంబర్ 1 స్థానంలో ఉన్న ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్
- వాల్ మార్ట్ కు పోటీగా బరిలో నిలిచే యోచన
- ఇందుకోసం ఇప్పటికే చర్చలు
దేశీయంగా నంబర్ 1 స్థానంలో ఉన్న ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసే ఆలోచనలో అమెరికాకు చెందిన అమేజాన్ ఉన్నట్టు తాజా సమాచారం. ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసి భారత్ మార్కెట్లో పాగా వేయాలన్న వాల్ మార్ట్ వ్యూహానికి చెక్ పెట్టేందుకే అమేజాన్ రంగంలో దిగనున్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో సంబంధం వున్న ఇద్దరు వ్యక్తులు ఈ మేరకు మీడియాకు సమాచారం చేరవేశారు. ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసేందుకు అమేజాన్ ఇప్పటికే ముందస్తు చర్చలు మొదలు పెట్టినట్టు వారు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద రిటైలర్ గా ఉన్న వాల్ మార్ట్ కూడా ఫ్లిప్ కార్ట్ లో 55 శాతం వాటా కోసం ఇప్పటికే చర్చలు నిర్వహించింది. ఒకవేళ ఫ్లిప్ కార్ట్ వాటాలు వాల్ మార్ట్ సొంతం అయితే కంపెనీకి మరిన్ని జవసత్వాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.