New Delhi: ఏటీఎంలో చేయి ఇరుక్కుపోయి పట్టుబడిన దొంగ!
- రెక్కీ నిర్వహించి ఏటీఎం దోపిడీకి ప్రణాళిక వేసిన బాబు
- డబ్బులు తీస్తుండగా ఇరుక్కుపోయిన చేయి
- అరెస్ట్ చేసిన పోలీసులు
ఏటీఎంలో నగదు చోరీకి వచ్చిన దొంగ చేయి మిషన్ లో ఇరుక్కు పోవడంతో పోలీసులకు దొరికిపోయిన ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఔరంగాబాద్ కు చెందిన నజీర్ అలియాస్ బాబు అనే దొంగ న్యూఢిల్లీలోని విశ్వాస్ నగర్ లో ఉన్న ఒక ఏటీఎంలో పక్కా ప్రణాళికతో చొరబడ్డాడు.
ముందుగా రెక్కీ నిర్వహించి, గార్డు లేడని నిర్ధారించుకుని, గ్యాస్ కట్టర్, స్ప్రే పెయింట్, ముఖానికి గుడ్డ, చేతికి గ్లోవ్స్ తో ఏటీఎంలో దూరాడు. లోపలికి రాగానే స్ప్రే పెయింట్ తీసి, సీసీ కెమెరాలకు కొట్టాడు. దీంతో కెమెరాలు కనిపించడం మానేశాయి. తరువాత గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ ను కట్ చేశాడు. డబ్బు తీసుకునేందుకు రంధ్రంలో చేయి పెట్టాడు. అంతే, నజీర్ చేయి ఏటీఎం మిషన్ లో ఇరుక్కుపోయింది.
ఇంతలో మెయిన్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన సర్వైలెన్స్ టీవీలో సీసీటీవీ పుటేజీ కనిపించకపోవడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటీన ఆ ఏటీఎం వద్దకు వెళ్లగా షట్టర్ సగం తెరిచి కనిపించింది. దీంతో లోపలకు వెళ్లిన పోలీసులకు ఏటీఎంలో చేయి ఇరుక్కుపోయిన నజీర్ కనిపించాడు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఢిల్లీలో ఏటీఎంల దోపిడీ ముఠాలతో నజీర్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.