Dubai: పాకిస్థాన్ వల్ల పెను ప్రమాదంలో దుబాయ్.. అప్రమత్తంగా ఉండాలంటూ అత్యున్నత భద్రతాధికారి ట్వీట్
- ఉద్యోగాల పేరుతో గల్ఫ్‌లోకి మాదక ద్రవ్యాల సరఫరా
- పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పాకిస్థానీలు
- భారతీయులు క్రమ శిక్షణగా ఉంటారంటూ మెచ్చుకోలు
పాకిస్థాన్‌తో గల్ఫ్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని ఎమిరేట్స్ అత్యున్నత భద్రతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్‌లోకి పాకిస్థాన్ ఇబ్బడిముబ్బడిగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది గల్ఫ్ కమ్యూనిటీకి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల భద్రాతాధికారులు దుబాయ్‌లో పలు డ్రగ్ రాకెట్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలన్నీ దుబాయ్ నుంచో, మరెక్కడి నుంచో తమ పనులను చక్కబెడుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాల్లో అత్యధిక శాతం పాకిస్థాన్‌కు చెందినవి కావడం దుబాయ్ ఆందోళనకు కారణం.
ఈ విషయాన్ని జనరల్ సెక్యూరిటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ దాహి ఖల్ఫాన్ ట్విట్టర్ ద్వారా పేర్కొంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘పాకిస్థాన్ కారణంగా గల్ఫ్ కమ్యూనిటీ పెను ప్రమాదంలో పడింది. వారు అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొస్తున్నారు’’ అని ట్వీట్ చేస్తూ డ్రగ్స్‌తో పట్టుబడిన ముగ్గురు పాకిస్థానీల ఫొటోను పోస్ట్ చేశారు.
పాకిస్థానీలకు ఉద్యోగాలను ఇవ్వడం ఆపేయాలని ఖల్ఫాన్ ఆదేశించినట్టు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. దేశం కోసం వారికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిలిపివేయాలని, అది మన విధి అని ఆయన పేర్కొనట్టు రాశాయి. భారతీయులు చాలా క్రమశిక్షణతో ఉంటారని, కానీ పాకిస్థానీల వల్ల దేశం ప్రమాదంలో పడిందని లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో దేశంలోకి చొరబడుతున్న పాకిస్థాన్ దేశీయులు నేరాలకు పాల్పడుతున్నారని, స్మగ్లింగ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నట్టు పత్రికలు రాశాయి.