ramgopal verma: రాంగోపాల్ వర్మకు మరోసారి నోటీసులు పంపనున్న సైబర్ క్రైమ్ పోలీసులు

  • గత ఫిబ్రవరిలో వర్మను విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • విచారణలో జీఎస్టీని పోలెండ్ లో చిత్రీకరించారని తెలిపిన వర్మ
  • ఆ సినిమాను హైదరాబాదులోని స్టార్ హోటల్ లో చిత్రీకరించారని ఫిర్యాదు చేసిన ఇద్దరు వ్యక్తులు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నోటీసులు పంపనున్నారు. వర్మ దర్శకత్వంలో జీఎస్టీ (గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) లఘు చిత్రం సోషల్ మీడియా మాధ్యమంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లఘుచిత్ర చిత్రీకరణ హైదరాబాద్‌ లోని స్టార్‌ హోటల్లో జరిగినట్లు తాజాగా ఫిర్యాదు రావడంతో ఈ కేసును మరోసారి విచారించనున్నారు.

గతంలో విచారణ సందర్భంగా ఆ సినిమాని పోలెండ్ లో చిత్రీకరించారని, వాస్తవానికి ఆ సినిమాకి తాను దర్శకత్వం వహించలేదని, నిర్మాతలు కోరితే స్కైప్‌ (అంతర్జాల ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం) ద్వారా సూచనలు చేశానంటూ రాంగోపాల్‌ వర్మ వాంగ్మూలమిచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ సినిమా కథ తనదేనని ఫిర్యాదు చేసిన యువకుడు, దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశాడు.

మరో ఇద్దరు వ్యక్తులు తమ వివరాలు గోప్యంగా ఉంచాలని కోరుతూ, జీఎస్టీ సినిమాని హైదరాబాదులోనే చిత్రీకరించారని, మియా మాల్కోవాను హైదరాబాద్‌ రప్పించారని చెబుతూ, పలు సాక్ష్యాలు అందజేసినట్టు తెలుస్తోంది. దీంతో వర్మను మరోసారి విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సారి విచారణలో వర్మ జీఎస్టీ చిత్రీకరణకు పోలెండ్‌ వెళ్లారా? లేదా? అన్నది నిర్ధారించనున్నారు. ఆయన పాస్ పోర్టును కూడా పరిశీలించనున్నారు.

 అలాగే, గతంలో ఈ సినిమాలో అసభ్యత, అశ్లీలతలున్నాయన్న అభియోగాలతో పాటు, సామాజిక కార్యకర్త దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై గత జనవరిలో నమోదైన కేసుల్లో వర్మను ఫిబ్రవరిలో విచారించిన పోలీసులు, ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకుని, సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపించారు. ఈ నివేదిక వచ్చిన అనంతరం వర్మపై చర్యలుంటాయని పోలీసులు చెబుతున్నారు

  • Loading...

More Telugu News