Saina Nehwal: మొత్తానికి సైనా నెహ్వాల్ తండ్రికి క్రీడా గ్రామంలోకి అనుమతి.. ముగిసిన వివాదం
- కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తండ్రిని అనుమతించకపోవడంపై సైనా ఆగ్రహం
- పోటీల నుంచి తప్పుకుంటానని హెచ్చరిక
- దిగొచ్చిన ఐవోఏ.. హర్వీర్‌కు అనుమతి
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి తన తండ్రి హర్వీర్ సింగ్‌ను అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సైనా క్రీడల నుంచి తప్పుకుంటానని హెచ్చరించింది. దీంతో స్పందించిన అధికారులు హర్వీర్ పేరును జాబితాలో చేర్చారు.
మంగళవారం సైనా నెహ్వాల్ భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతాకు లేఖ రాసింది. తన తండ్రి హర్వీర్‌కు అక్రెడిటేషన్ కల్పించాలని కోరింది. తండ్రి లేకుండా తాను బ్యాడ్మింటన్ బరిలోకి దిగలేనని తేల్చి చెప్పింది. దీంతో స్పందించిన ఐవోఏ సీడబ్ల్యూసీ విలేజ్‌లోకి హర్వీర్‌ను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది.
సైనా ఆడే మ్యాచులన్నింటినీ హర్వీర్ చూడవచ్చని, ఇందుకోసం బస, ఇతర ఏర్పాట్లు చేసినట్టు ఐవోఏ తెలిపింది. క్రీడా గ్రామంలోకి తన తండ్రిని అనుమతిస్తూ ఐవోఏ నిర్ణయం తీసుకోవడంపై సైనా హర్షం వ్యక్తం చేసింది. ట్విట్టర్ ద్వారా ఐవోఏకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయంలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది.