KCR: కేసీఆర్ ... ఇంత ద్వంద్వ వైఖరి ఎందుకయ్యా?: జైపాల్ రెడ్డి
- కేసీఆర్ హైదరాబాద్ లోనేమో బీజేపీని విమర్శిస్తారు
- ఢిల్లీ వెళితే ఆ పార్టీతో స్నేహంగా ఉంటారు
- కేసీఆర్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది
హైదరాబాద్ లోనేమో బీజేపీ గురించి విమర్శిస్తారు, ఢిల్లీ వెళితే మాత్రం ఆ పార్టీతో స్నేహంగా ఉంటారని సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘హైదరాబాద్ లో బీజేపీపై విమర్శించడం.. ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను పరామర్శించడం.. ఇంత ద్వంద్వ వైఖరి ఎందుకయ్యా? తెలంగాణలో అభ్యుదయ శక్తులు, ప్రజాసంఘాలు పటిష్టంగా ఉన్నాయి. బీజేపీతో కలిసి లేనంటూ వాళ్లను కేసీఆర్ మోసం చేశారు.
అదేవిధంగా, అల్ప సంఖ్యాక వర్గాలు, ముస్లింలు, క్రైస్తవులనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే బీజేపీతో కేసీఆర్ కలుస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటిని కేసీఆర్ ఎందుకు అడగడటం లేదంటే.. కేసీఆర్ అవినీతిని వెయ్యి కళ్లతో కేంద్ర ప్రభుత్వం చూస్తోంది...రికార్డు చేసుకుంటోంది.. కేసీఆర్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.