sukumar: శివనాగులు పాడిన పాటను మార్చడానికి కారణం ఇదే: దర్శకుడు సుకుమార్
- పాటను షూట్ చేసే సమయానికి శివనాగులు పాట రికార్డ్ కాలేదు
- ఆ తర్వాత రీరికార్డింగ్ లో శివనాగులు పాటకు లిప్ సింక్ కాలేదు
- ఆల్బమ్ లో ఎప్పటికీ శివనాగులు సాంగే ఉంటుంది
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఇప్పటికే రూ. 100 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలో 'గట్టునుంటావా' అనే పాటను జానపద గాయకుడు శివనాగులు పాడారు. అయితే ఈ పాటలో శివనాగులు వాయిస్ ను తొలగించి, దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ ను పెట్టారు. దీనిపై శివనాగులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై సినీ వర్గాలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషయంపై సుకుమార్ స్పందించాడు. ఈ పాటను షూట్ చేసే సమయానికి శివనాగులతో పాట రికార్డ్ కాలేదని చెప్పాడు. దీంతో, దేవిశ్రీ పాడిన వర్షన్ తోనే షూటింగ్ కానిచ్చేశామని... ఆ తర్వాత శివనాగులుతో పాట రికార్డ్ చేసినా, రీరికార్డింగ్ సమయంలో ఆయన వాయిస్ కు లిప్ సింక్ కాలేదని... దీంతో దేవిశ్రీ వర్షన్ ను అలాగే ఉంచామని తెలిపాడు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, టెక్నికల్ కారణాల వల్లే అలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సినిమా ఆల్బమ్ లో ఎప్పటికీ శివనాగులు పాడిన పాటే ఉంటుందని తెలిపాడు.