Axis Bank: యాక్సిస్ బ్యాంకుకి రిజర్వు బ్యాంకు గట్టి షాక్
- బంగారం దిగుమతి బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు
- తెలియరాని కారణాలు
- కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకులకు కూడా దక్కని అవకాశం
ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతికి అనుమతి ఉన్న బ్యాంకుల జాబితా నుంచి యాక్సిస్ బ్యాంకును తొలగిస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. సోమవారం రాత్రి పొద్దుపోయాక దీనికి సంబంధించిన జాబితాను సెంట్రల్ బ్యాంకు విడుదల చేసింది.
మనదేశానికి బంగారాన్ని దిగుమతి చేస్తున్న బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు అగ్రశ్రేణిలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బంగారం దిగుమతికి బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ నోవా స్కాటియా సహా మొత్తం 16 బ్యాంకులకు అనుమతి లభించింది. యాక్సిస్ బ్యాంకుతో పాటు కరూర్ వైశ్యా బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంకులకు కూడా బంగారం దిగుమతులకు అనుమతి లభించలేదు.