fake news: నకిలీ వార్తలు రాస్తే జర్నలిస్టు అక్రెడిటేషన్ ర‌ద్దు చేస్తామన్న కేంద్ర సర్కారు.. తప్పుబట్టిన తెలంగాణ సీఎం!

  • జర్నలిస్ట్‌ల అక్రెడిటేషన్ ర‌ద్దు చేస్తామన్న కేంద్ర సర్కారు
  • మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల
  • పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఉందన్న కేసీఆర్
  • ఫేక్ న్యూస్‌పై ఇప్పటికే చట్టాలున్నాయని వ్యాఖ్య

నకిలీ వార్తలను పత్రికల్లో ప్రచురించడం, టీవీల్లో ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే అందుకు బాధ్యులైన‌ జర్నలిస్ట్‌లకు ఇచ్చే అక్రెడిటేషన్ ర‌ద్దు చేయాల‌ని కేంద్ర సమాచార శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఫేక్ న్యూస్ పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా విడుద‌ల చేసింది. త‌మ‌కు ఏదైనా ఒక వార్త నకిలీది అని ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్‌కు రిఫర్ చేస్తామని పేర్కొంది.

ఆయా సంస్థ‌లు 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేస్తాయ‌ని, ఆ స‌మ‌యంలో జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్‌లో ఉంటుందని, ఆ వార్త  త‌ప్పని తేలితే చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్ప‌డితే ఆరు నెలలు, రెండోసారి మ‌ళ్లీ ఫేక్ న్యూస్ రాస్తే ఏడాది పాటు, మూడవ‌సారి ఉల్లంఘ‌న‌ అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది.

  కాగా, కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత స‌ర్కారుపై ఉంటుంద‌ని, ఫేక్ న్యూస్ పై ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని అన్నారు. జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేస్తామనడం మంచిది కాద‌ని, దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఇది ఆందోళన కలిగించే విష‌య‌మ‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News