Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై అంటోన్న మఠాధిపతులు...!

  • ఎన్నికల బరిలో నలుగురు మఠాధిపతులు...!
  • సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌లోని నలుగురు మంత్రులపై బీజేపీ తరపున పోటీకి సై
  • మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే నెల 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని పలువురు మఠాధిపతులు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున వారంతా పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆయన పనితీరును ఇటీవల కాలంలో వారు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.

 రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కేబినెట్‌లోని నలుగురు మంత్రులపై ఈ మఠాధిపతులు పోటీ చేయడానికి సై అంటున్నారు. మరోవైపు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలోని పలు మఠాలను సందర్శించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో మఠాధిపతుల పోటీ వార్తలకు ఈ పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.

ఈ ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మఠాధిపతుల్లో ఉడుపిలోని ఓ మఠానికి చెందిన లక్ష్మీవారతీర్థ స్వామి, ధర్వాడ్ మఠానికి చెందిన బసవానంద స్వామి, చిత్రదుర్గలోని మఠానికి చెందిన మదర చెన్నయ్యస్వామి, దక్షిణ కన్నడలోని ఓ మఠానికి చెందిన రాజశేఖరానంద స్వామి ఉన్నారు. వారిలో శ్రీ గురు బసవ మహామనే మఠాధిపతి బసవానంద స్వామికి దృష్టి లోపముంది.

ఇక లింగాయత్ మఠానికి చెందిన బసవానంద కాలాఘటగి నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్మికమంత్రి సంతోష్ లాడ్‌పై పోటీకి రెడీ అంటున్నారు. ఈ నలుగురు మఠాధిపతుల పేర్లతో పాటు మరికొందరు కూడా జేడీ(ఎస్) తరపున లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News