jaitley: రాజ్యసభ నాయకుడుగా మరోసారి జైట్లీ నియామకం... ప్రకటించిన చైర్మన్ వెంకయ్యనాయుడు
- ముగిసిన గత పదవీ కాలం
- దీంతో మరోసారి అవకాశం ఇచ్చిన ప్రధాని
- దీనిపై సభలో ప్రకటన చేసిన చైర్మన్
రాజ్యసభ నాయకుడుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి నియమితులయ్యారు. అరుణ్ జైట్లీ ఇప్పటికే రాజ్యసభా నాయకునిగా ఉండగా ఆయన గత సభ్యత్వం నిన్నటితో తీరిపోయింది. అయితే, ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి మరోసారి రాజ్యసభకు జైట్లీ ఎన్నికయ్యారు. దీంతో మరోసారి సభా నాయకునిగా ఆయనకు అవకాశం లభించింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఈ రోజు ప్రకటన చేశారు.
ఉదయం సభ ప్రారంభమైన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నుంచి తనకు ఓ లేఖ వచ్చిందని చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. జైట్లీని మరోసారి రాజ్యసభ లీడర్ గా ప్రధానమంత్రి నియమించినట్టు అందులో పేర్కొన్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే, రాజ్యసభ సభ్యుడిగా జైట్లీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. కొత్తగా 58 మంది పెద్దల సభకు ఎన్నిక కాగా, అందులో 41 మందే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.