YSRCP: విజయ సాయిరెడ్డి అజ్ఞానానికి ఇదే నిదర్శనం: యనమల
- చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
- ఎద్దేవా చేసిన యనమల
- సభాహక్కుల నోటీసు ఇవ్వడం హాస్యాస్పదం
- సభాహక్కుల ఉల్లంఘన ఇక్కడ ఉత్పన్నం కాదు
ఏపీ అసెంబ్లీలో ప్రధాని, పీఎంవోను సీఎం చంద్రబాబు నాయుడు కించపరిచేలా మాట్లాడారని అభ్యంతరం తెలుపుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు. ఈ విషయంపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సభాహక్కుల నోటీసు ఇవ్వడం హాస్యాస్పదమని, సభాహక్కుల ఉల్లంఘన ఇక్కడ ఉత్పన్నం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
సభా నియమాల పట్ల విజయసాయిరెడ్డి అజ్ఞానానికి ఇదే నిదర్శనమని, ఆయన ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు చెల్లదని యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ... అసెంబ్లీలో సీఎం మాట్లాడిన అంశాలపై బయటి వ్యక్తులు మాట్లాడే అధికారం ఉండదని, అంతేగాక సభా హక్కుల నోటీసు ఇవ్వడాన్ని తప్పుబడుతూ తాము కూడా విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చి, అసెంబ్లీకి పిలిచి వివరణ కోరవచ్చని యనమల అన్నారు. అవిశ్వాస తీర్మాన నోటీసులు తిరస్కరించే అధికారం స్పీకర్‌కు లేదని, మంత్రివర్గంపై విశ్వాసం లేదని అవిశ్వాస నోటీసు ఇస్తారని మంత్రి అన్నారు.