Chandrababu: చంద్రబాబు మహా మేధావి.. మేము కూడా ఒప్పుకుంటాం.. కానీ..: వైసీపీ ఎంపీ మేకపాటి

  • వాజ్ పేయికే గుడ్ బై చెప్పారు... మోదీ ఎంత?
  • మోదీ గ్రాఫ్ పెరిగితే, మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తారు
  • ఇలాంటివన్నీ చంద్రబాబుకు అలవాటే

బీజేపీ, టీడీపీలు నాలుగేళ్ల పాటు సుఖవంతమైన కాపురం చేశాయని వైసీపీ ఎంపీ మేకపాటి అన్నారు. ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గుతోందన్న ఆలోచనతో ఇప్పుడు ఎన్డీయే నుంచి ఆయన బయటకు వచ్చారని తెలిపారు. వాజ్ పేయి ఉన్నప్పుడే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబుకు... మోదీకి దూరంగా జరగడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

ఒకవేళ మోదీ గ్రాఫ్ మళ్లీ పెరుగుతుందని అనిపిస్తే... మళ్లీ ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేందుకు కూడా చంద్రబాబు సిద్ధపడతారని... ఇవన్నీ ఆయనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే భావనతో వైసీపీకి చెందిన ఎంతో మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కున్నారని విమర్శించారు.

చంద్రబాబులో గొప్ప మేధావితనం ఉందని... దాన్ని ఎవరూ కాదనలేమని మేకపాటి చెప్పారు. ఇప్పుడు 30వ సారి చంద్రబాబు ఢిల్లీకి వచ్చారని... పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పలువురు నేతలతో ఆయన భేటీ అయ్యారని... దాన్ని తాము కూడా చూశామని... అయినా ఎలాంటి ఫలితం రాలేదని అన్నారు.

చంద్రబాబు ఎలాంటి నాయకుడో దేశంలో ఉన్న రాజకీయ నేతలందరికీ తెలుసని చెప్పారు. బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించడం దారుణమని... 'చంద్రబాబు గారూ ఇది మీకు తగునా' అని ప్రశ్నించారు. ప్రజలను ఇలా మభ్యపెట్టడం ఎంతవరకు న్యాయమని అడిగారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

నాలుగేళ్లపాటు నిమ్మకునీరెత్తినట్టు ఉన్న చంద్రబాబు... ఎన్డీయే అన్యాయం చేసిందంటూ, ఇప్పుడు మాట్లాడుతుండటం విచిత్రంగా ఉందని అన్నారు. చంద్రబాబు వంటి నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండకూడదని చెప్పారు. ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ పర్యటనే తప్ప, రాష్ట్ర ప్రయోజల కోసం చేస్తున్నది కాదని అన్నారు.

  • Loading...

More Telugu News