Lok Sabha: అవిశ్వాసంపై చర్చకు సిద్ధమే అంటూనే లోక్ సభను రేపటికి వాయిదా వేసిన సుమిత్ర.. రాజ్యసభ కూడా వాయిదా!

  • మంకుపట్టు వీడని కేంద్ర ప్రభుత్వం
  • అన్నాడీఎంకే ఎంపీల ఆందోళనను సాకుగా చూపిన స్పీకర్
  • ఉభయసభలు రేపటికి వాయిదా

కేంద్ర ప్రభుత్వం తన మంకుపట్టును వీడటం లేదు. అవిశ్వాసంపై చర్చ జరపకుండా తప్పించుకుంటూనే ఉంది. ఈ రోజు కూడా లోక్ సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్... వాయిదా అనంతరం సభ మరోసారి ప్రారంభమైన తర్వాత రేపటికి వాయిదా వేశారు.

అన్నాడీఎంకే ఎంపీలు ఎప్పట్లాగానే వెల్ లోకి దూసుకెళ్లి కావేరీ బోర్డు కోసం ఆందోళన చేపట్టారు. అవిశ్వాసంపై చర్చను చేపట్టాల్సి ఉందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని సుమిత్రా మహాజన్ పలుమార్లు విన్నవించారు. అవిశ్వాసం చేపట్టేందుకు అవసరమైన 50 మందిని లెక్కించేందుకు తనకు వీలు కావడం లేదని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, 50 మందికాదు 100 మందిని లెక్కించుకోవచ్చని స్పీకర్ ను ఉద్దేశించి అన్నారు. అన్నాడీఎంకే ఎంపీల గొడవను సాకుగా చూపి, అవిశ్వాసంపై చర్చ జరగకుండా చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ ఇదేమీ పట్టించుకోని స్పీకర్... సభ ఆర్డర్ లో లేదంటూ రేపటికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. 

  • Loading...

More Telugu News