Tamilnadu: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ఐపీఎస్ అధికారి కుమార్తె.. కానిస్టేబుల్ ఉద్యోగం ఊడగొడతానని చిందులు!
- డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన తమిళనాడు అదనపు డీజీపీ కుమార్తె
- కారు ఆపిన కానిస్టేబుల్ పై ఆగ్రహం
- నేరుగా కమిషనరేట్ కు వెళ్లి ఫిర్యాదు
పూటుగా మందుకొట్టి, కారులో మద్యం సీసాతో వెళ్తూ, పోలీసులకు పట్టుబడిన ఐపీఎస్ అధికారి కుమార్తె, 'నీ ఉద్యోగం ఊడగొడతా'నని కానిస్టేబుల్ కు వార్నింగ్ ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... గత అర్ధరాత్రి చెన్నైలోని పాలవక్కం బీచ్ ప్రాంతంలో తమిళనాడు అదనపు డీజీపీ తమిళ్ సెల్వన్ కుమార్తె మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడింది. ఆ సందర్భంగా తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగంలోంచి తీసేయిస్తాను’ అంటూ చిందులేసింది.
వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి కానిస్టేబుల్ ను విధుల నుంచి తప్పించాలని సూచించింది. ఈ తతంగం మొత్తాన్ని ఆ కానిస్టేబుల్ వీడియో తీయడంతో ఇది వైరల్ గా మారింది. దీంతో ఆమె నేరుగా కమీషనరేట్ కు వెళ్లి కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించాడని, వద్దని వారిస్తున్నా వీడియో తీసి, తమకు ఇబ్బంది కల్పించాడని, అతనిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.