India: భారత్ లో విద్య దుస్థితి... ప్రపంచంలోని 200 అత్యుత్తమ యూనివర్సిటీల్లో మన దేశానివి రెండే!
- 200 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితా వెల్లడి
- భారత్ నుంచి రెండే యూనివర్సిటీలకు చోటు
- ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీలకు స్థానం
భారత్ లో విద్యావ్యవస్థ దుస్థితిని అసోచామ్-యెస్ ఇనిస్టిట్యూట్ ల సంయుక్త అధ్యయనం వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యావ్యవస్థ తీరుతెన్నులపై ఈ రెండు సంస్థలు అధ్యయనం నిర్వహించి, నివేదిక విడుదల చేశాయి. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 200 అత్యుత్తమ యూనివర్సిటీలు స్థానం సంపాదించగా, భారత్ నుంచి కేవలం రెండు యూనివర్సిటీలకు మాత్రమే స్థానం లభించడం విద్యావ్యవస్థ దుస్థితిని కళ్లకు కడుతోంది.
అమెరికా 49 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో అగ్రస్థానంలో నిలవగా, 30 అత్యుత్తమ యూనివర్సిటీలతో బ్రిటన్ ద్వితీయ స్థానం దక్కించుకుందని, మూడో స్థానంలో 11 యూనివర్సిటీలతో జర్మనీ నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో 8 యూనివర్సిటీలతో చైనా, ఆస్ట్రేలియాలు నిలిచాయని నివేదిక వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) లు మాత్రమే స్థానం సంపాదించుకోగలిగాయి.
ప్రతిభావంతులైన వారందరూ అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు, పరిశోధనలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. దీంతో ఆయా దేశాలకు మేధో, ఆర్థికపరమైన లబ్ధి చేకూరుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. సుమారు 6 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం ఏడాదికి లక్షా 34వేల కోట్ల (20 బిలియన్ డాలర్లు) రూపాయలు వెచ్చిస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది.
భారత్ లోని విద్యాసంస్థలు పరిశోధనలకు ప్రోత్సాహలేమి, ఉద్యోగ లభ్యత, నవకల్పన, వ్యాపారాపేక్షతలు తక్కువగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కుంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. భారత్ లో యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చే పట్టభద్రుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారని ఈ నివేదిక వివరించింది.