News anchor: న్యూస్ యాంకర్ రాధికకు కన్నీటి వీడ్కోలు!
- రాధిక భౌతిక కాయానికి నివాళులర్పించిన యాంకర్ ఝాన్సీ, టీయూడబ్ల్యూ రాష్ట్ర నేతలు
- సంతాపం తెలిపిన ఏపీబీజేఏ నేతలు
- ఈఎస్ఐ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర
మానసిక ఒత్తిడి భరించలేక ‘నా మెదడే నా శత్రువు’ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న న్యూస్ యాంకర్ రాధిక అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. హైదరాబాద్, మూసాపేటలో నివసిస్తున్న రాధిక ఆదివారం రాత్రి విధులు ముగించుకుని వచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం ఆమె భౌతికకాయాన్ని మూసాపేట తీసుకొచ్చారు.
యాంకర్ ఝాన్సీ, టీయూడబ్ల్యూ రాష్ట్ర నేతలు పి.రవికుమార్, క్రాంతికుమార్, మారుతీసాగర్, దయాసాగర్, యాంకర్ సత్తి తదితరులు రాధికకు నివాళులర్పించారు. అనంతరం ఈఎస్ఐ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ సమస్యలనేవి సహజమని, ఆత్మహత్య దానికి పరిష్కారం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఏపీబీజేఏ) రాష్ట్ర కన్వీనర్ బి.రాధాకృష్ణ, అనుశ్రీ, కొండయ్య, రాఘవయ్య, కె.శ్రీనివాస్, యజ్ఞచౌదరి తదితరులు రాధిక మృతికి సంతాపం తెలిపారు. కాగా, బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న రాధిక కుమారుడు భానుతేజరెడ్డి తల్లి మరణించిన విషయం తెలియక అటూ ఇటూ తిరుగుతుండడాన్ని చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.