Telangana: రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం : మంత్రి కేటీఆర్
- జీహెచ్ఎంసీకి ప్రతి నెలా ప్రత్యేక నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం
- వర్షాలు వచ్చేలోగా నీళ్లు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టాలి
- ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి
హైదరాబాద్ నగరంలో రోడ్లను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జలమండలి కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజనీరింగ్ సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెలా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఒక్కో వార్డుకు ఏఈ స్థాయి అధికారిని నియమించామని, రోడ్ల నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. నిధులతో పాటు, సరిపడినంత సిబ్బందిని ఇస్తున్నామని, అయినప్పటికీ రోడ్ల నిర్వహణలో లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న 60 రోజుల్లో, వర్షాలు వచ్చే నాటికి నీళ్లు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు సైతం తీసుకుని ఇలాంటి ప్రాంతాల గుర్తింపులో సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. కాగా, గత ఏడాదిలో కురిసిన వర్షాల నేపథ్యంలో నీళ్లు నిలిచే 181 ప్రాంతాలు, 346 రోడ్డ వల్నరబుల్ పాయింట్స్ గుర్తించిన విషయాన్నికేటీఆర్ కు అధికారులు తెలిపారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలకు జోనల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యత తీసుకుని వాటిని పరిష్కరించాలని, వర్షాకాల ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఇప్పటి నుంచే రోడ్ల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని, మెట్రో రైల్ కారిడార్లు, హెచ్చార్డీసి వంటి సంస్థల పరిధిలో ఉన్న రోడ్లపైన జీహెచ్ఎంసీతో కలిసి పని చేసి వాటి నిర్వహణలో మరింత చొరవ చూపాలని ఆదేశించారు.
ఈ రోడ్ల నిర్వహణ రాబోయే రెండు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన జరగాలని, మొత్తం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందికి వచ్చే రెండు నెలల పాటు సెలవులు రద్దు చేసి, నిర్వహణ కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వాటర్ వర్క్స్ పైపులైన్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనూ రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ జలమండలితో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలని, కాంట్రాక్టులో పేర్కొన్న విధంగా పైపులైన్లతోపాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని అన్నారు. వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో మ్యాన్ హోళ్ల నిర్వహణపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.