Arvind Kejriwal: అరుణ్ జైట్లీకి 'సారీ' అంటూ లేఖ రాసిన కేజ్రీవాల్
- 2015 డిసెంబర్‌లో జైట్లీపై ఆరోపణలు చేశాను
- కొందరు వ్యక్తులు ఇచ్చిన పత్రాలతోనే అలా అన్నాను
- ఆ సమాచారమే నన్ను తప్పుదోవపట్టించింది
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని గతంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండిపడ్డ జైట్లీ.. కేజ్రీవాల్ తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ కోర్టులో పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ నేపథ్యంలో జైట్లీని ఉద్దేశించి ఈ మేరకు కేజ్రీవాల్ లేఖ రాశారు. 2015 డిసెంబర్‌లో కొందరు వ్యక్తులు తనకు కొన్ని పత్రాలు అందించారని, వాటిని ఆధారంగా చేసుకునే తాను జైట్లీపై ఆరోపణలు చేశానని చెప్పారు.
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా అప్పట్లో జైట్లీ వ్యవహరించిన సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుతో పాటు పటియాలా హౌస్ కోర్టు విచారణ పరిధిలో ఉన్నాయని తెలిపారు. కొందరు తనకు ఇచ్చిన సమాచారం తనను తప్పుదోవపట్టించిందని అన్నారు.