Air India: ఎయిరిండియా అమ్మకం మోదీ సర్కారు చేస్తున్న అతిపెద్ద స్కామ్: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
- ప్రక్రియనంతా అనుక్షణం గమనిస్తున్నా
- తేడా వస్తే ప్రైవేట్ క్రిమినల్ లా ఫిర్యాదు
- హెచ్చరించిన సుబ్రహ్మణ్య స్వామి
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయం మోదీ సర్కారు చేస్తున్న అతిపెద్ద కుంభకోణం అవుతుందని ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత విక్రయాన్ని వ్యతిరేకిస్తూ, తను ప్రైవేట్ క్రిమినల్ లా ఫిర్యాదును దాఖలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన ఆయన, ఈ మొత్తం ప్రక్రియ ఎవరి అధీనంలో జరుగుతోందో, ఏం చేస్తున్నారో తాను అనుక్షణం గమనిస్తున్నానని, ఏదైనా నేరం తన కంటికి కనిపిస్తే, వెంటనే ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
తాను మొదటి నుంచి ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. కాగా, సంస్థలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ఎయిర్ ఇండియాలో డిజిన్వెస్ట్ మెంట్ జరిగితే సంస్థ యాజమాన్య హక్కులు ప్రైవేటు సంస్థలకు లేదా విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి.
కాగా, ప్రస్తుతం రూ. 52 వేల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న ఎయిరిండియాను గట్టెక్కించాలంటే, వాటాల విక్రయం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది. ఆరేళ్ల క్రితం నాటి యూపీఏ ప్రభుత్వం రూ. 30 వేల కోట్లతో ఉద్దీపన కల్పించినా, సంస్థ పూర్తిగా గట్టున పడలేదు. దీంతో ఇక వాటాల విక్రయం ఒక్కటే మిగిలిన మార్గమని కేంద్రం భావిస్తోంది.