Jayaprakash Narayan: పవన్ కల్యాణ్‌తో విభేదాలు లేవు: జయప్రకాశ్ నారాయణ
- పవన్ చొరవ తీసుకుని జేఎఫ్‌సీ ఏర్పాటు చేశారు
- తరువాతి కార్యాచరణ చేపట్టకపోతే ఎలా? అనే ఒత్తిడి వస్తోంది
- అధ్యయనం చేసే ప్రక్రియను కొనసాగిస్తాం
- ఇది ఏ రాజకీయ పార్టీకో.. వ్యక్తికో సొంతమైన విషయం కాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తనకు విభేదాలు లేవని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని జేఎఫ్‌సీని ఏర్పాటు చేసి కొంతమేరకు చేశారని, అయితే తరువాతి కార్యాచరణ చేపట్టకపోతే ఎలా? అని కొందరి నుంచి ఒత్తిడి వస్తోందని అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం, చేయాల్సిన సాయంపై అధ్యయనం చేయడం అనే ప్రక్రియను కొనసాగించడం ఏ రాజకీయ పార్టీకో వ్యక్తికో సొంతమైన విషయం కాదని అన్నారు.
తాము ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ జేఎఫ్‌సీకి ప్రత్యామ్నాయం కాదని జేపీ అన్నారు. ఈ పని ఇతరులు చేస్తే మనం వారికి సహకరించాలని, ఒకవేళ వారు చేయకపోతే మనమే చేయాలని వ్యాఖ్యానించారు. తాను పవన్ కల్యాణ్ ని బహిరంగంగా మెచ్చుకున్నానని, లక్షల మంది డబ్బులిచ్చి ఆయన సినిమాలకు వస్తారని కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారని అన్నానని గుర్తు చేశారు. పవన్ ఓ ప్రయత్నం చేశారని, జేఎఫ్‌సీ కొంత వరకు బాధ్యత నిర్వర్తిస్తే తాము మిగతా బాధ్యతను పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ఏపీ కోల్పోయిందని, ఏపీకి వస్తోన్న రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని, కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో రాష్ట్రంపై భారం వేయకుండా కేంద్ర ప్రభుత్వ వాటా పెంచాలని జేపీ అన్నారు. వీటిని ఎలా సాధించుకోవాలనే విషయంపై కూడా తాము చర్చిస్తామని తెలిపారు.