Indian Railways: సకల సౌకర్యాలతో సెలూన్ బోగీ ప్రయాణం!
- అటాచ్డ్ బాత్రూమ్‌లతో కూడిన రెండు ప్రత్యేకమైన పడకగదులు
- అందుబాటులో ఏసీ, సెలూన్ అటెండెంట్లు
- వీఐపీ ప్యాసింజర్లతో బయలుదేరిన తొలి సెలూన్ కోచ్
సామాన్యుడికి విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడం కోసం ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) మొట్టమొదటి రైల్వే సెలూన్ బోగీని ప్రారంభించింది. ఈ బోగీ జమ్మూ వెళ్లేందుకు ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి శుక్రవారం బయలుదేరింది. దీనిని జమ్మూ మెయిల్ ట్రైయిన్‌కు తగిలించారు. ఈ సెలూన్ బోగీ ఓ కదిలే ఇల్లు మాదిరిగా ఉండి, ఇందులో అటాచ్డ్ బాత్రూమ్‌లతో కూడిన రెండు ప్రత్యేకమైన పడక గదులుంటాయి. ఏసీతో పాటు వ్యాలెట్ సర్వీసూ ఉంది. అంతేకాక ఇందులో ఓ అతిపెద్ద లివింగ్ కమ్ డైనింగ్ గది, కిచెన్ కూడా ఉంటాయి. ఇందులో ప్రయాణిస్తున్నప్పుడు మనోహర దృశ్యాలను వీక్షించేలా వెనుకభాగంలో ఓ కిటికీ కూడా ఉంటుందని రైల్వే శాఖ ట్విట్టర్‌లో తెలిపింది.
దీనికి సంబంధించిన ఓ ఫొటోని కూడా అప్ లోడ్ చేసింది. మొట్టమొదటిసారిగా ఆరుగురు వీఐపీ కస్టమర్లతో ఇది బయలుదేరింది. అంతకుముందు రోడ్డు లేదా విమాన సదుపాయం లేని ప్రదేశాలకు చేరుకునేందుకు రైల్వే అధికారులు మాత్రమే దీనిని వినియోగించే వారని ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ సెలూన్ బోగీ అద్దె సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని వెల్లడించింది. హోటల్ ని తలపించే ఈ సెలూన్ బోగీలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓ ఏసీ అటెండెంట్, ఓ సెలూన్ అటెండెంట్ అందుబాటులో ఉంటారు. కాగా, అన్ని రైల్వే జోన్లకూ కలిపి మొత్తం 336 సెలూన్ బోగీలున్నాయి. వాటిలో 62 ఏసీ సెలూన్లు.