Pawan Kalyan: జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్.. ఈ రోజు ఐదు గంటలపాటు చర్చ
- మేనిఫెస్టో రూపకల్పనలపై కూడా కసరత్తు
- మేధావులు, వివిధ వర్గాలవారితో ఈ రోజు చర్చ
- జిల్లాల్లో కమిటీల నియామకానికి ప్రతి జిల్లాకు ఒక బృందం ఏర్పాటు
- ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా ముందుకెళ్లాలనే విషయంపై పవన్ చర్చలు
జనసేన జిల్లాల కమిటీల నియామకం, పార్టీని విస్తృత పరచడం, మేనిఫెస్టో రూపకల్పనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్... మేధావులు, వివిధ వర్గాలవారు, గత నాలుగేళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారితో చర్చిస్తున్నారు. వారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో కమిటీల నియామకానికి ప్రతి జిల్లాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఈ బృందాల్లో జిల్లాల విస్తీర్ణాన్ని బట్టి ఒక్కో జిల్లాకు 20 నుంచి 25 మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రెసిడెంట్ టీమ్ గా వ్యవహరిస్తారు. వీరు జనసేన ముఖ్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి ఎంపికలు చేస్తారు. వివిధ రంగాలలోని ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవాతత్పరులు, అధికార, అనధికార ప్రముఖులను కలసి కమిటీల ఏర్పాటులో వారి సలహాలు సూచనలను సేకరిస్తారు.
ప్రజామోదం పొందిన వ్యక్తులను కమిటీలో నియమించే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు జిల్లా బాధ్యులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటనలు జరిపిన అనంతరం కమిటీల్లో నియామకానికి అర్హతలు గలవారిని ప్రెసిడెంట్ టీమ్ గుర్తించి కేంద్ర కార్యాలయానికి ఒక నివేదికతో పాటు జాబితా సమర్పిస్తుంది. ఈ జాబితా ఆధారంగా ప్రెసిడెంట్ సెంట్రల్ టీం కమిటీలకు రూపకల్పన చేసి పార్టీ అధ్యక్షుడి ఆమోదానికి పంపుతుంది. తూర్పు గోదావరి, అనంతపురం టీమ్ లు ఇప్పటికే కమిటీల నియామకాల ప్రక్రియను ప్రారంభించాయి.
ప్రముఖులతో భేటీ..
విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ విధి విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా ముందుకెళ్లాలి? పార్టీ మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను కోరుకుంటున్నారు? అన్న అంశాలపై సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సమావేశంలో అనుమోలు గాంధీ ( రైతు కూలీ హక్కుల పోరాట సమితి నేత), ఏ నౌరోజీ రెడ్డి (సమాజ సేవ), సిరిపురపు ఫ్రాన్సిస్ (న్యాయవాది, అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ), వీవీ రామారావు (నేషనల్ ట్రేడ్ యూనియన్ నాయకులు), జాకబ్ శాస్త్రి ( రిటైర్డ్ ప్రొఫెసర్), నండూరి రామకృష్ణ (వాకర్స్ సంఘం అధ్యక్షుడు) ఉన్నారు.