sridhar: అమరలింగేశ్వరస్వామి సన్నిధిలో బహిరంగ చర్చకు రావాలి: జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే సవాల్

  • ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌పై జగన్ ఆరోపణలు
  • వైసీపీలా తమ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేయట్లేదని వ్యాఖ్య 
  • అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ఎమ్మెల్యే 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో పాదయాత్ర చేస్తోన్న జగన్ ఇటీవల ఆ జిల్లా టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శ్రీధర్ స్పందిస్తూ... గుంటూరు జిల్లాలోని తన నియోజకవర్గమైన పెదకూరపాడులో అవినీతి చేశానని జగన్‌ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

ఈ రోజు గుంటూరులో శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ... ఇసుక రీచుల్లో అవినీతికి పాల్పడ్డానని జగన్ తనపై చేసిన ఆరోపణలపై అమరావతి అమరలింగేశ్వరస్వామి సన్నిధిలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, జగన్ అక్కడకు రావాలని అన్నారు. తమ పార్టీ రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని, వైసీపీలా కుట్రపూరిత రాజకీయాలు చేయట్లేదని ఉద్ఘాటించారు. జగన్‌లో నిలువెల్లా విషం పాకి ఉందని అన్నారు.

కాగా, జగన్ ఇటీవల పాదయాత్రలో మాట్లాడుతూ.. పెదకూరపాడు నియోజక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అంటే అర్థం ఏంటో తెలుసా? అంటూ.. మామూళ్లు, లంచాలు తీసుకునే అబ్బాయి (ఎమ్మెల్యే) అని అన్నారు. ఆ నియోజకవర్గంలో వేల లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు చెబుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News