Salt: ఆకాశంలో ఉప్పు చల్లుతారట.. ఎందుకో తెలుసా?
- గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు అమెరికా శాస్త్రవేత్తల ప్రతిపాదన
- ప్లానెటరీ సైన్స్ కాంగ్రెస్ లో తమ పరిశోధన వివరాల సమర్పణ
- భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు
- కాలుష్య ఉద్గారాల నియంత్రణే మార్గమని స్పష్టీకరణ
పెద్ద పెద్ద విమానాలు.. వాటి నిండా ఉప్పు సంచులు.. భూమికి పన్నెండు, పదమూడు కిలోమీటర్ల ఎత్తున ఆ ఉప్పు అంతా వెదజల్లుతారట. ఇదేమిటి, ఎందుకిలా అనిపిస్తోందా..? భూమిని గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించడానికి ప్రఖ్యాత శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రతిపాదన ఇది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూమి వేడెక్కిపోతున్న విషయం తెలిసిందే. దీనికితోడు క్లోరోఫ్లూరో కార్బన్ల మూలంగా ఓజోన్ పొరకు రంధ్రాలు పడి అతినీలలోహిత కిరణాలు భూమిపై పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భూమిని గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించేందుకు ఉప్పు చల్లితే చాలా..? ఇదేం పిచ్చి ఆలోచన అనిపిస్తుంటుంది గానీ నిజానికి శాస్త్రవేత్తలు దీనిపై చాలా కసరత్తు చేశారు. దీనికి సంబంధించి లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్ లో తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.
సాధారణంగా అగ్ని పర్వతాలు పేలినప్పుడు భారీగా సల్ఫర్ డయాక్సైడ్, ఇతర రసాయన వాయువులు వెలువడతాయి. అవి దట్టంగా కమ్ముకోవడం వల్ల భూమిపై పడే సూర్యరశ్మి తగ్గిపోయి.. వాతావరణం చల్లగా మారిపోతుంది. భూమిపై కొన్ని వందల ఏళ్ల కింద ఇలా పెద్ద పెద్ద అగ్ని పర్వతాలు పేలినప్పుడు.. ఆయా ప్రాంతాల్లో కొంతకాలం అతిశీతల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని ఆధారంగా గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు పలు రకాల సిద్ధాంతాలు, ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు.
- కొన్నేళ్ల కింద యూరప్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం ట్రోపోస్పియర్ పై పొరలో వజ్రాలకు సంబంధించిన ధూళిని వెదజల్లాలని ప్రతిపాదించగా.. మరికొందరు అల్యూమినా (అల్యూమినియం మూలకపు పొడి)ని చల్లాలని సూచించారు. కానీ ఇవి ఓజోన్ పొరను దెబ్బతీసేందుకు కారణమవుతాయని, మానవుల ఆరోగ్యానికి కూడా హానికరమని నిర్ధారించారు.
- అయితే ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు సౌర కుటుంబంలోని గ్రహాలు, గ్రహ శకలాలపై అధ్యయనం చేస్తుండగా.. ఉప్పు ఆవిరి అంశం వారి దృష్టిలోకి వచ్చింది. ఆయా గ్రహాలు, గ్రహశకలాలపై ఉన్న ఉప్పు ఏరోసాల్స్.. సూర్యరశ్మిని ప్రభావవంతంగా పరావర్తనం చెందిస్తున్నట్టు వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే భూమిపైకి ప్రసరించే సూర్య కిరణాల ప్రభావం తగ్గేలా ఉప్పు ఏరోసాల్స్ ను ట్రోపోస్పియర్ పొర పైభాగంలో చల్లాలని ప్తరిపాదన తెచ్చారు.
‘‘ఇదొక ఆసక్తికరమైన ఆలోచన. ట్రోపోస్పియర్ కు పైన ఉప్పు అణువుల (ఏరోసాల్)ను వదలడం వల్ల అవి సూర్యరశ్మిని పరావర్తనం చెందించి.. భూమి వేడెక్కకుండా కాపాడతాయి. అయితే దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉంది..’’ అని పరిశోధనలో పాల్గొన్న అమెరికన్ ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త రాబర్ట్ నీల్సన్ చెప్పారు.
అయితే ఈ పరిశోధనపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘‘ఉప్పు ఏరోసాల్స్ వెదజల్లే ప్రతిపాదన బాగానే ఉన్నా.. ఇది ఎంతవరకు సాధ్యమనేది తెలియాల్సి ఉంది.’’ అని న్యూయార్క్ కు చెందిన పరిశోధనా సంస్థ రోడియం గ్రూప్ శాస్త్రవేత్త కెల్లీ మెక్ కస్కర్ చెప్పారు.
అసలు ఉప్పు అంటే సోడియం, క్లోరైడ్ ల మిశ్రమం అని, అందులోని క్లోరిన్ ఓజోన్ పొరను తీవ్రంగా దెబ్బతీస్తుందని అమెరికాలోని పెన్ స్టేట్ వాతావరణ నిపుణుడు మైఖేల్ మాన్ పేర్కొన్నారు. ఇక ఉప్పులో అయోడిన్ ఉంటుందని, అత్యంత క్రియాశీలకమైన ఆ మూలకం కూడా ఓజోన్ పొరలో రసాయన మార్పులకు కారణమవుతుందని కొలరాడో వాతావరణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సిమోన్ టిల్మెస్ చెప్పారు.
‘ఉప్పు’ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలపై రాబర్ట్ నీల్సన్ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు గొప్ప ఆవిష్కరణలుగా చెప్పుకొంటున్న వాటిని మొదట్లో చాలా మంది వ్యతిరేకించినవారే. తప్పుపట్టిన వారే. ఇప్పటికైతే మా పరిశోధన గ్లోబల్ వార్మింగ్ నియంత్రణకు తోడ్పడే దిశగానే సాగుతోంది..’’ అని చెప్పారు.
అయితే ముందుగా మనం వాహనాలు, పరిశ్రమలు, ఇతర చోట్ల నుంచి పర్యావరణానికి చేటు చేసే హానికర ఉద్గారాలను వెలువరించడం తగ్గించకపోతే... ఎవరెన్ని చేసినా, ఏ పరిశోధనలైనా గ్లోబల్ వార్మింగ్ ను ఆపలేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.