GHMC: ఎల్లుండి నుంచి అమల్లోకి కొత్త పార్కింగ్ పాలసీ... ప్రజలకు లాభదాయకమే... వివరాలివి!
- తొలి 30 నిమిషాలు బేషరతుగా ఫ్రీ
- ఆపై షాపింగ్ చేసినా, సినిమా చూసినా కూడా ఉచితమే
- కొత్త జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
మాల్స్, మల్టీప్లెక్సుల్లో పార్కింగ్ దందాను అడ్డుకుంటూ తెలంగాణ సర్కారు కొత్త పార్కింగ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన పార్కింగ్ విధానాన్ని తప్పనిసరిగా అన్ని మాల్స్, మల్టీప్లెక్సులు అమలు చేయాల్సిందేనని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ కమిషర్ ఆదేశించారు. కొత్త నిబంధనల ప్రకారం, తొలి 30 నిమిషాల వ్యవధి పాటు ఎటువంటి పార్కింగ్ ఫీజునూ వసూలు చేసేందుకు వీలు లేదు.
ప్రతి ఒక్కరికీ బేషరతుగా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించాల్సిందే. ఆపై 31 నుంచి 60 నిమిషాల వరకూ షాపింగ్ సెంటర్ లో షాపింగ్ చేసినట్టు బిల్లు చూపితే పార్కింగ్ ఫీజును వసూలు చేయకూడదు. ఒకవేళ బిల్లును చూపించకుంటే నిర్ణీత మొత్తాన్ని వాహనదారుడి నుంచి తీసుకోవచ్చు. ఆపై గంట దాటితే, పార్కింగ్ మొత్తానికన్నా అధికంగా డబ్బుతో కొనుగోలు చేసినట్టు బిల్లు చూపించాల్సి వుంటుంది. ఒకవేళ, మాల్ లో సినిమాహాల్ ఉండి, దానిలో సినిమాను చూసినట్లయితే, మూడు గంటల సమయం దాటినా పార్కింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. వాహనాల పార్కింగ్ సమయాన్ని తెలిపేలా సరైన ఉపకరణాలను వాడాలని, ఫీజుల వివరాలు అందరికీ కనిపించేలా డిస్ ప్లే చేయాలని అధికారులు ఆదేశించారు.