ICICI: వీడియోకాన్ కు రూ. 3,250 కోట్ల రుణమిచ్చి రూ. 64 కోట్ల లంచం పొందిన చంద కొచ్చర్... ఐసీఐసీఐలో పెను దుమారం!
- క్విడ్ ప్రోక్వో విధానంలో నిధుల బదిలీ
- రూ. 64 కోట్లతో వాటాలు కొని రూ. 9 లక్షలకే అమ్మేసిన వీడియోకాన్
- రుణం పొందిన ఆరు నెలలకే యాజమాన్య బదిలీ
- ఆపై ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు చెల్లించని వీడియోకాన్
దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో వెలుగుచూసిన మరో కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రైవేటు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ నుంచి వీడియోకాన్ కు అక్రమంగా రూ. 3,250 కోట్ల రుణం వెళ్లగా, అందుకు ప్రతిఫలంగా సీఈఓ చంద కొచ్చర్ కు రూ. 64 కోట్ల లబ్ధి చేరిందన్నది ఆరోపణ. ఈ నిధులు కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ చేతికందాయని తెలుస్తోంది. వివిధ కంపెనీల ద్వారా క్విడ్ ప్రోకో జరిగిందని ఓ పరిశోధనాత్మక కథనం ఈ విషయాన్ని వెలుగులోకి తేగా, మొత్తం వ్యవహారం బ్యాంకింగ్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ, ఈడీ తదితర దర్యాఫ్తు సంస్థలు దృష్టిని సారించాయి.
మరిన్ని వివరాల్లోకి వెళితే, దాదాపు పదేళ్ల క్రితం చంద కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, మరో ఇద్దరు బంధువులు, వీడియోకాన్ గ్రూప్ యజమాని వేణుగోపాల్ ధూత్ లు కలసి న్యూ పవర్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఆపై తన సొంత కంపెనీ అయిన వీడియోకాన్ నుంచి ధూత్, కొత్త సంస్థకు రూ. 64 కోట్ల రుణం ఇచ్చారు. ఆపై సంస్థలోని తన మొత్తం వాటాలను, యాజమాన్య హక్కులను కేవలం రూ. 9 లక్షలకే దీపక్ కొచ్చర్ కు విక్రయించారు.
ఇది మామూలుగా జరిగితే అనుమానాలు వచ్చేవి కావేమో. బ్యాంకు నుంచి రూ. 3,250 కోట్ల రుణం వీడియోకాన్ కు వెళ్లిన ఆరు నెలల వ్యవధిలోనే కంపెనీ చేతులు మారింది. ఇక ఆపై తీసుకున్న అప్పును వీడియోకాన్ చెల్లించలేదు. ఇంకా బ్యాంకుకు రూ. 2,810 కోట్లు రావాల్సి వుండగా, గత సంవత్సరం ఈ ఖాతాను మొండిబకాయిగా ఐసీఐసీఐ గుర్తించింది. అదే ఇప్పుడు పలు అనుమానాలను రేకెత్తుతోంది.