Sachin Tendulkar: వాళ్లని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి: సచిన్
- స్మిత్, వార్నర్‌లను ప్రశాంతంగా ఉండనివ్వాలంటూ సూచన
- మరింత బాధపెట్టవద్దంటూ మీడియాను కోరిన సచిన్
- ఇప్పటికే తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారంటూ కామెంట్
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాదిపాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సానుభూతి వ్యక్తం చేశాడు. వీరి వ్యవహారంలో మీడియా వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టాడు. తప్పు చేసినందుకు వాళ్లిద్దరూ ఇప్పటికే బాధపడుతున్నారని, వారిని మరింత బాధపెట్టవద్దని ట్వీట్ చేశాడు.
కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు తప్ప వారు ప్రతిసారీ తమ తప్పును గుర్తు చేసుకుంటూ ఉంటారని పేర్కొన్నాడు. కాబట్టి వారిని ఇకనైనా ప్రశాంతంగా వదిలేసి కొంత మానసిక ప్రశాంతత కల్పించాలని సూచించాడు. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, కెవిన్ పీటర్సన్లు కూడా స్మిత్, వార్నర్‌లపై సానుభూతి వ్యక్తం చేశారు. మీడియా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని ట్వీట్ చేశారు.
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై విచారణ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌లపై ఏడాదిపాటు నిషేధం విధించగా బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.