Pawan Kalyan: గుంటూరులో ఆందోళనకర స్థాయిలో వైరల్ హెపటైటిస్: పవన్ కల్యాణ్
- చనిపోయిన సాధులక్ష్మీ, లావణ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
- కలుషిత నీరే కారణమని డాక్టర్లు చెబుతున్నారు
- 180 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు
- యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
గుంటూరు జిల్లాలో ఆందోళనకర స్థాయిలో వైరల్ హెపటైటిస్ విస్తరిస్తోందని తక్షణం చర్యలు చేపట్టాలని ఏపీ సర్కారుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేస్తూ... "రెండు వారాల క్రితం గుంటూరులో డయేరియా 23 మందికి పైగా పొట్టన పెట్టుకోగా, ఇప్పుడు వైరల్ హెపటైటిస్ ముగ్గుర్ని బలితీసుకుంది. రామిరెడ్డి తోట ప్రాంతంలో ఈ మహమ్మారి ప్రబలింది. చనిపోయిన వారిలో ఒక బాలింత, రోజుల శిశువు, మరో మహిళ ఉన్నారు. ఈ మరణాలకు కూడా కలుషిత నీరే కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
రామిరెడ్డి తోటతోపాటు ప్రకాష్ నగర్, గుంటూరువారి తోట ప్రాంతాలలో మరో 180 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో డయేరియా వ్యాధిపై మానిటరింగ్ చేయడానికి జనసేన ఏర్పాటు చేసిన బృందం ఈ రోజు వ్యాధి పీడిత ప్రాంతాలలో పర్యటించి వివరాలు సేకరించడంతో పాటు వీడియోను కూడా చిత్రీకరించి బాధిత ప్రాంతాల వారితో మాట్లాడింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన సైనికులు ఈ ప్రాంతాలలో ఇంటింటికీ పర్యటించి భాధితులను పరామర్శించి వ్యాధి వ్యాప్తి చెందటానికి గల కారణాలను సేకరించారు.
ఈ వ్యాధి సోకి చనిపోయిన బాలింత సాధులక్ష్మీ, లావణ్య (22) కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. జనసేన శ్రేణులు సేకరించిన వివరాల మేరకు నెల రోజులుగా ఈ ప్రాంతాలలో తాగునీరు, డ్రెయినేజీలో కలవటం వల్ల కామెర్ల వ్యాధి వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. ఆ నీరు తాగిన వారందరూ తీవ్రమైన వాంతులు విరేచనాలు, కామెర్లతో బాధపడుతున్నారు.
ఈ వివరాలను అధికారులకు కూడా మానిటరింగ్ సభ్యులు అందజేయనున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కలుషిత నీరు సరఫరా కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నాను" అని పవన్ కల్యాణ్ అందులో పేర్కొన్నారు.