ap: ఏపీ బీజేపీలో కీలక మార్పులు.. హరిబాబుకి ఉద్వాసన.. రేపోమాపో ఉత్తర్వులు!

  • రాష్ట్ర అధ్యక్షుడిగా మాణిక్యాలరావు
  • కేంద్ర కమిటీలోకి సోము వీర్రాజు
  • మాణిక్యాలరావు నియామకం వెనుక రామ్ మాధవ్ హస్తం

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తొలగించబోతున్నారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాలరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. హరిబాబు మెతకవైఖరి పట్ల బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, హరిబాబు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని భావిస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడు దూకుడుగా లేకపోతే బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందనే భావనకు అగ్ర నేతలు వచ్చారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి (కాపు) చెందినవారు. చివరికి వీరిలో మాణిక్యాలరావు వైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇక మాణిక్యాలరావు నియామకంలో ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ రామ్ మాధవ్ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ... ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని రామ్ మాధవ్ భావించారు. అధ్యక్ష పదవిలో ఉన్నవారికి దూకుడుతో పాటు, కొన్ని సమయాల్లో సంయమనం కూడా అవసరమని ఆయన భావించారు. దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అనే తుది నిర్ణయానికి ఆయన వచ్చారు. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశించిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను బుజ్జగించేందుకు... వారిని జాతీయ కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News