Pakistan: పాక్ లో అమానవీయం... ఇంటి ఆడపడుచును అత్యాచారం చేసుకోమని పంపిన కుటుంబం!
- పాక్ లో ఓ యువతిపై అత్యాచారం
- పంచాయితీ పెట్టిన బాధితురాలి కుటుంబం
- తమ ఇంటి బిడ్డను పంపిస్తామని చెప్పిన నిందితుడి కుటుంబం
- ఆమెపై అత్యాచారం చేసిన బాధితురాలి సోదరుడు
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఇది. పాకిస్థాన్ లో ఎంత అమానవీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయో వెల్లడించేందుకు మరో ఉదాహరణ ఇది. ఓ యువతి అత్యాచారానికి గురైతే, ఆమె కుటుంబ సభ్యులు పంచాయితీ పెట్టిన వేళ, నిందితుడి కుటుంబం, తమ ఇంటి ఆడపిల్లను పంపుతామని, బాధితురాలి సోదరుడు రేప్ చేసుకోవచ్చన్న అసాధారణ ప్రతిపాదనతో వచ్చింది. దీనికి బాధితురాలి కుటుంబం కూడా నిస్సంకోచంగా అంగీకరించడం గమనార్హం.
కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనేలా జరిగిన ఈ ఘటన తోబాతెక్ సింగ్ అనే గ్రామంలో జరిగింది. తొలి అమ్మాయిని ఏ గదిలో, ఎక్కడ రేప్ చేశారో, అదే గదిలో నిందితుడి సోదరిని బాధితురాలి సోదరుడి వద్దకు పంపారు రెండు కుటుంబాల పెద్దలు. ఇక తాము చేయని పాపానికి బలైన ఇద్దరు అమ్మాయిలపై, రెండు కుటుంబాల పెద్దలు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అన్న చేసిన తప్పుకు తన మానాన్ని సమర్పించుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన చెల్లెలిపై సానుభూతిని చూపుతూ, పంచాయితీ పెద్దలను, రెండు కుటుంబాల వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.