Puri Jagannadh: 1984లో ఆగిన పూరీ జగన్నాథ 'రత్న భండార్' లెక్కింపు... తిరిగి తెరచుకోనున్న గదులు!
- పూరీ ఆలయంలో 7 గదుల్లో ఆభరణాలు
- 34 ఏళ్ల క్రితం లెక్కిస్తుంటే పాముల బుసలు
- తిరిగి ఇన్నాళ్లకు గదులు తెరిచేందుకు అనుమతి
అది 1984వ సంవత్సరం... పూరీలోని అత్యంత ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం. ఆలయంలోని 7 గదుల్లో స్వామివారికి సంబంధించిన విలువైన కానుకలు, ఆభరణాలు, వజ్రవైడూర్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా రాజులు, భక్తులు స్వామివారికి ఇచ్చిన కానుకలు అవి. వాటిని ఒక్కసారి చూసి లెక్కించి, తిరిగి దాచాలని అప్పటి దేవాలయ అధికారులు భావించారు. ఒక్కో గదినీ తెరచి లెక్కలు చూస్తుంటే, నాలుగో గది వద్దకు వచ్చేసరికి లోపలి నుంచి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. ఆపై మరే గదినీ అధికారులు తెరవలేదు.
ఇక ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ఒడిశా హైకోర్టు, ప్రభుత్వం అనుమతుల మేరకు జగన్నాథ ఆలయ ఖజానా (రత్న భండార్)ను తెరవాలని నిర్ణయించారు. ఈ రత్న భండార్ ఎంత పటిష్ఠంగా ఉందన్న విషయాన్ని పరిశీలిస్తామని, ఆపై మరింత భద్రతను కల్పించే విషయమై చర్చిస్తామని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా వెల్లడించారు. ఖజానాలో ఉన్న సంపదను లెక్కించాలని తాము భావించడం లేదని అన్నారు. కాగా, 1984 ప్రాంతంలో ఇదే ఆలయంలో పని చేసిన ఆర్ఎన్ మిశ్రా మాట్లాడుతూ, అప్పట్లో పాములు బుస కొట్టగా, నాలుగో గదిని తాము తెరవలేదని స్పష్టం చేశారు.