Chandrababu: అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వండి.. ప్రజలకు చంద్రబాబు పిలుపు
- డబ్బులున్న వారు అప్పులివ్వాలన్న చంద్రబాబు
- బ్యాంకుల కంటే మూడు శాతం అధికంగా వడ్డీ ఇస్తామన్న సీఎం
- త్వరలోనే విధివిధానాలు ఖరారు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరు అప్పులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. బ్యాంకుల కంటే రెండుమూడు శాతం అధిక వడ్డీ ఇస్తామని తెలిపారు. తమ వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లో దాచుకోకుండా రాజధాని నిర్మాణానికి వాటిని ఇస్తే బాండ్లు జారీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే సిద్ధం చేస్తామని అసెంబ్లీలో పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో వెల్లడించారు. ప్రవాసాంధ్రులు సహా రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు సహకరించాలని, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లానే అప్పులు ఇవ్వాలని కోరారు. విభజన హామీల అమలులో తాత్సారం చేస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 6వ తేదీ వరకు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని, ఉద్యోగులు అదనపు పని గంటలు పనిచేయడం ద్వారా నిరసన తెలపాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రతి ఒక్కరినీ కలుస్తానని చంద్రబాబు వివరించారు.