Facebook: డేటా లీక్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌కు కేంద్ర సర్కారు నోటీసులు
- డేటా లీక్ వ్యవహారంపై దృష్టిపెట్టిన కేంద్ర సర్కారు
- ఏప్రిల్ 7లోగా ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని ఆదేశం
- భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్‌బుక్ ప్రభావితం చేస్తోందా? అనే విషయం రాబట్టనున్న సర్కారు
డేటా లీక్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌కు కేంద్ర సర్కారు నోటీసులు పంపింది. ఏప్రిల్ 7లోగా ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమవుతోందని ఇటీవల వచ్చిన వార్తలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్‌బుక్ ఏమాత్రం ప్రభావితం చేసినా సహించబోమని, అవసరమైతే ఫేస్‌బుక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తమకు ఈ విషయంపై వివరాలు తెలపాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫేస్‌బుక్‌కు లేఖ రాసింది. ఫేస్‌బుక్‌లోని భారత ఖాతాదారుల సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలోనూ భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఏ సంస్థలయినా ప్రయత్నించాయా? అన్న విషయాన్ని తెలుసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.