kishan reddy: ఓయూ విద్యార్థులపై తెలంగాణ సర్కారు కక్ష కట్టిందన్న బీజేపీ ఎమ్మెల్యేలు.. సమాధానం ఇచ్చిన కడియం శ్రీహరి

  • తమకు ఏ యూనివర్సిటీపైనా కక్ష లేదన్న కడియం
  • విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో తీసుకొస్తోన్న సంస్కరణలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్య
  • బీజేపీ సభ్యులు విశాలమైన మనసుతో ఆలోచించాలని హితవు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ రోజు తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ -2018 బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై అనంతరం సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఓయూ విద్యార్థులపై ప్రదర్శిస్తోన్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఆ యూనివర్సిటీ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

దీంతో తెలంగాణ  విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ... తమకు ఏ యూనివర్సిటీపైనా కక్ష లేదని, విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో తాము తీసుకొస్తోన్న సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. బీజేపీ సభ్యులు తమ ఆలోచనలను విస్తృతం చేసుకుని, విశాలమైన మనసుతో ఆలోచించాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో మాత్రమే ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారని, ఇప్పటికే గుజరాత్‌లో 31, మధ్యప్రదేశ్‌లో 24, రాజస్థాన్‌లో 46 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయని కడియం శ్రీహరి తెలిపారు.

తాము విద్యార్థుల అవకాశాలను, స్టేట్ యూనివర్సిటీలను కాపాడుతూనే కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకొస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్  యాక్ట్ -2018 బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపిన అనంతరం ఆ బిల్లు ఆమోదం పొందింది.

  • Loading...

More Telugu News