stalin: చంద్రబాబును చూసి సిగ్గుతెచ్చుకోండి: పళని, పన్నీర్ లపై స్టాలిన్ ఫైర్
- చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ మీకెందుకు లేదు
- కేంద్రాన్ని చంద్రబాబు నిలదీస్తున్నారు
- మీరు కేంద్రం ముందు సాష్టాంగపడ్డారు
రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీస్తున్నారని, పోరాటం చేస్తున్నారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రశంసించారు. తమిళనాడులోని ఈరోడ్ లో పార్టీకి సంబంధించిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలపై ఆయన నిప్పులు చెరిగారు. వీరిద్దరూ కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోందని స్టాలిన్ విమర్శించారు. కావేరీ బోర్డు విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ లకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడుతున్నారని చెప్పారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని గతంలో డీఎంకే ఎలుగెత్తి చాటిందని... ఇప్పుడు ఆ ఘోష ఏపీలో ప్రతిబింబిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ఉదాసీనతను తమిళ ప్రజలు అవహేళన చేస్తున్నారని చెప్పారు.